- ఇష్టారీతిన వాడుతున్న ఫంక్షన్ హాల్స్, వివిధ రకాల ఇండస్ట్రీస్
- తనిఖీలు చేపడుతున్న జిల్లా అధికారులు
- ఇప్పటికే 393 ఇండస్ట్రీస్ కు నోటీసులు జారీ
- ఎన్వోసీ తీసుకోకపోతే ఫైన్లు విధించేలా చర్యలు
హనుమకొండ, వెలుగు: ఎండాకాలం ప్రారంభం కావడంతో భూగర్భజలాల వినియోగం ఎక్కువవుతోంది. ఫంక్షన్ హాల్స్, బల్క్ వాటర్ సప్లయర్స్, గ్రానైట్ కంపెనీలు, వివిధ రకాల ఇండస్ట్రీస్ బోర్ల నుంచి ఇష్టమొచ్చినట్టుగా గ్రౌండ్ వాటర్ ను తోడేస్తున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో భూగర్భజల మట్టం పడిపోతోంది.
విచ్చలవిడిగా నీటిని తోడేసే ఇండస్ట్రీలపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. వాల్టా యాక్టులోని తెలంగాణ గ్రౌండ్ వాటర్ ఎక్స్ ట్రాక్షన్ రూల్స్-2023 ప్రకారం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్వోసీ) తీసుకోని ఇండస్ట్రీలకు నోటీసులు జారీ చేస్తున్నారు. నిర్దిష్ట సమయంలోగా ఎన్వోసీలు తీసుకోకపోతే ఫైన్లు విధించడంతో పాటు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో వాటిని సీజ్ చేసేలా చర్యలు చేపడుతున్నారు.
విచ్చలవిడిగా వినియోగం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో డొమెస్టిక్, అగ్రికల్చర్, ఇతర కమర్షియల్ అన్నీ కలిపి ఏడు లక్షలకుగాపై బోర్ వెల్స్ ఉన్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాల్టా యాక్ట్-2002, గ్రౌండ్ వాటర్ ఎక్స్ ట్రాక్షన్ రూల్స్-2023 ప్రకారం బోర్ వెల్స్ వినియోగానికి ప్రభుత్వం నుంచి ఎన్వోసీ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది.
డొమెస్టిక్, అగ్రికల్చర్ బోర్లతో పాటు అర్బన్ ఏరియాల్లో నెలకు 25 వేల లీటర్ల లోపు వినియోగించే అపార్ట్మెంట్లు, హౌజింగ్ సొసైటీలకు మినహాయింపు ఉండగా, ఫంక్షన్ హాల్స్, హోటల్స్, బల్క్ వాటర్ సప్లయర్స్, గ్రానైట్, ఇతర మైనింగ్ ప్రాజెక్టులు మాత్రం తప్పనిసరిగా ఎన్వోసీ తీసుకోవాలి.
ఈ మేరకు ఇన్ ఫ్రాస్ట్రక్షర్ ప్రాజెక్ట్స్ రూ.10 వేలు, రోజుకు 25 వేలలీటర్లలోపు వినియోగించే కంపెనీలు, కమర్షియల్, బల్క్ వాటర్ సప్లై ఇండస్ట్రీలు రూ.14,500, 25 వేల నుంచి 50 వేల లీటర్లు వినియోగించేవి రూ.18 వేలు, 50 వేల నుంచి లక్ష లీటర్లకు రూ.32 వేలు, అంతకుమించి వాడే ఇండస్ట్రీలు రూ.42 వేలు, మైనింగ్ ప్రాజెక్టులు రూ.లక్ష చెల్లించి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంది.
కానీ, క్షేత్రస్థాయిలో వందలాది ఫంక్షన్ హాల్స్, గ్రానైట్, మైనింగ్ ఇండస్ట్రీస్ ఆ రూల్స్ ఏమీ పట్టించుకోకుండా 24 గంటల పాటు బోర్లు నడిపిస్తూ రోజూ లక్షలాది లీటర్ల నీటిని తోడేస్తున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వాటర్ లెవల్ పడిపోతోంది.
393 ఇండస్ట్రీలకు నోటీసులు..
తెలంగాణ గ్రౌండ్ వాటర్ ఎక్స్ ట్రాక్షన్ రూల్స్-2023 ప్రకారం 20 వేల లీటర్ల కన్న ఎక్కువగా వినియోగించే ఏ ఇండస్ట్రీ అయినా ఎస్టీపీలు ఏర్పాటు చేసుకోవాలి. ట్యాంపర్డ్ ప్రూఫ్ డిజిటల్ వాటర్ ఫ్లో మీటర్స్, గ్రౌండ్ వాటర్ పర్యవేక్షణ కోసం పైజోమీటర్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టం పెట్టుకోవాలి. భూగర్భజలాలు కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టాలి.
కానీ, క్షేత్రస్థాయిలో అలాంటి వ్యవస్థ ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే హనుమకొండ జిల్లావ్యాప్తంగా 75 ఇండస్ట్రీలు మాత్రమే ఎన్వోసీ తీసుకోగా, రూ.45 లక్షల వరకు ఆదాయం వచ్చింది. మిగతా వాటి సంగతి తేల్చేందుకు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూల్స్ పాటించని ఫంక్షన్ హాల్స్, హోటల్స్, గ్రానైట్ ఇండస్ట్రీలు, ఇతర కంపెనీలకు నోటీసులు ఇష్యూ చేస్తున్నారు.
ఇప్పటివరకు హోటల్స్, హాస్పిటల్స్, గ్రానైట్ కట్టింగ్ కంపెనీలు సహా 393 ఇండస్ట్రీలకు నోటీసులు జారీ చేశారు. సంబంధిత రుసుము చెల్లించి ఎన్వోసీ తీసుకోవాలని వాటిలో పేర్కొన్నారు. ఓ వైపు భూగర్భజలశాఖ అధికారులు ఎన్వోసీ తీసుకోని ఇండస్ట్రీలకు నోటీసులు జారీ చేస్తుండగా, రూల్స్ పాటించని వాటికి జిల్లా విజిలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో పెనాల్టీలు విధించడం, అవసరాన్ని బట్టి సీజ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
రూల్స్ పాటించకపోతే సీజ్..
భూగర్భ జలాల వినియోగంపై జిల్లాలో ఇప్పటికే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ముందుగా ఎన్వోసీ తీసుకోని హాస్పిటల్స్, హోటల్స్, ఇండస్ట్రీలకు నోటీసులు అందజేస్తున్నాం. రూల్స్ పాటించని వాటిపై జిల్లా విజిలెన్స్ కమిటీ ఆదేశాల మేరకు సీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
- శైలశ్రీ మల్లికాదేవి, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భజల శాఖ-
